లూధియానా, డిసెంబర్ 24: వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాలు కీలక ప్రభావం చూపనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన రైతు సంఘాలు ఇప్పుడు ఎన్నికల పోరుపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఎన్నికల బరిలో నిలిచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగంగా ఉన్న 25 సంఘాలు లూధియానాలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. తమ నిర్ణయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా సంఘాలు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తున్నది. అయితే మరో ఏడు రైతు సంఘాలు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటామని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ఎస్కేఎం బ్యానర్‌ను, పేరును వినియోగించవద్దని ఈ సంఘాలు కోరాయి.