డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మృతుల్లో ఓ పోలీస్ అధికారి, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. ఈ పేలుడులో గాయపడిన మరో ఏడుగురు రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నమామీ గంగే ప్రాజెక్టులో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో అలక్‌నందా నది పరీవాహక ప్రాంతంలో ఓ బ్రిడ్జికి విద్యుదీకరణ పనులు చేస్తుండగా భారీ శబ్దంతో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి, మిగతా ఐదుగురిని చమోలీ జిల్లాలోని గోపేశ్వర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పేలి వాచ్మెన్ మరణించాడని ప్రాజెక్టు సిబ్బంది ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారని, పోలీసులు అక్కడికి వెళ్లేసరికి చాలామంది విద్యుత్ షాక్‌తో పడిపోయి కనిపించారని ఉత్తరాఖండ్ ఏడీజీ తెలిపారు.
కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.