(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : గుజరాత్లో ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో విమాన ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది. విమానయాన రంగంలో అనుభవమున్న పలువురు నిపుణులు ఎయిరిండియా విమానానికి ప్రధానంగా 4 కారణాలను చెప్తున్నారు.
పక్షులు ఢీకొనడం-ఇంజిన్‌కు పవర్ కట్ ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షులు విమానాన్ని ఢీకొట్టడం సాధారణంగా జరుగుతుందని మాజీ పైలట్ సౌరభ్ భాట్నగర్ అన్నారు. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం విషయంలోనూ ఇదే జరుగొచ్చని అభిప్రాయపడ్డారు. పక్షులు ఢీకొట్టడంతో సాంకేతిక సమస్య ఎదురై రెండు ఇంజిన్లకు పవర్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఉండొచ్చని అనుమానించారు. దీంతో అప్పటివరకూ లిఫ్టింగ్ పొజిషన్లోకి వెళ్లిన విమానం ఉన్నట్టుండి కిందికి దూసుకొచ్చిందని ఆయన గుర్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్యాసింజర్లతో పాటు క్యాబిన్ లగేజీ, చెకిన్ బ్యాగేజీ వీటికి అదనం. పైగా వేసవి కావడంతో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కారణంగా గాలిలోకి ఎగిరాక థ్రస్ట్ (ముందుకు నెట్టేయడం) ఫోర్సెస్ ఎలా పనిచేశాయి? టేకాఫ్‌కు అవసరమైన స్పీడ్‌ను విమానం అందుకొందా? అనేవి కూడా ముఖ్యమేనని విమానయాన రంగ నిపుణుడు ప్రొఫెసర్ మెక్డెర్మిడ్ అభిప్రాయపడ్డారు.
రన్‌వే మీద నుంచి విమానం పైకి ఎగురాలంటే రెక్కల మీద ఉండే ‘ఫ్లాప్స్’ సరిగ్గా తెరుచుకోవాలని అమెరికాకు చెందిన ఎవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్ జాన్ ఎం కాక్స్ చెబుతున్నారు. ఒకవేళ, ఫ్లాప్స్ సరిగ్గా తెరుచుకోకపోయినా, అవి సరైన పొజిషన్లో ఉండకపోయినా.. విమానం సరైన సమయంలో తగిన ఎత్తును అందుకోలేదని అంటున్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఫ్లాప్స్ సమస్య ఎదురయినట్టు తనకు అనిపిస్తున్నదని జాన్ పేర్కొన్నారు.
విమానం టేకాఫ్ అయ్యి.. నిర్ణీత ఎత్తును అందుకొన్నాక ల్యాండింగ్ గేర్లు విమానంలోపలికి వెళ్తాయి. అయితే, ఎయిరిండియా విమానం 825 అడుగుల ఎత్తులోకి వెళ్లాక కూడా ల్యాండింగ్ గేర్లు లోపలికి వెళ్లకపోవడం అనుమానాలను కలిగిస్తున్నదని మాజీ పైలట్ ఈశాన్ ఖలీద్ అన్నారు. ఇంజిన్‌లో సమస్య ఉంటేనే ఇలా జరుగుతుందని చెప్పారు. కల్తీ ఫ్యూయెల్‌ను వాడితే కూడా ఇంజిన్‌లో సమస్యలు ఎదురయ్యే ప్రమాదమున్నదని ఎయిరిండియా మాజీ అధికారి కెప్టెన్ మనోజ్ హాతీ తెలిపారు. ఏదిఏమైనా.. బ్లాక్‌బాక్స్‌లోని డేటాను విశ్లేషించిన తర్వాతే, విమాన ప్రమాదానికి అసలు కారణమేంటో తెలిసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫ్లాప్స్‌లో సమస్య రెక్కల మీద ఉండే ‘ఫ్లాప్స్’ సరిగ్గా తెరుచుకోకపోవడంతో సరైన సమయంలో విమానం తగిన ఎత్తును అందుకోలేకపోవచ్చు.
పక్షుల ఢీ ఇంజిన్‌కు పవర్ కట్ పక్షులు ఢీకొనడంతో రెండు ఇంజిన్లకు పవర్ సైప్లెలో అంతరాయం ఏర్పడొచ్చు.
ల్యాండింగ్ గేర్‌లో సమస్య? టేకాఫ్ అయ్యాక కూడా ల్యాండింగ్ గేర్లు బయటే ఉన్నాయని తెలుస్తున్నది. ఇంజిన్‌లో సమస్య ఉంటేనే ఇలా జరుగుతుంది.
ఓవర్ లోడ్ 1.25 లక్షల లీటర్ల ఇంధనం, ప్యాసింజర్లతో ఫ్లెట్పై లోడ్ పెరుగొచ్చు. వాతావరణ ప్రభావంతో థ్రస్ట్ ఫోర్సెస్‌లో మార్పులు చోటు చేసుకోవచ్చు.