horrific crashes | 2024 ముగింపుకు చేరింది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమవుతోంది. అయితే, ఏడాది చివరి నెల డిసెంబర్ విమానయాన చరిత్రలో ‘చీకటి నెల’గా (dark month) నిలిచింది. ఎందుకంటే డిసెంబర్ (December) నెలలో ఏకంగా ఏడు ఘోరమైన విమాన ప్రమాదాలు (horrific crashes) చోటుచేసుకున్నాయి. మొత్తం ఏడు ప్రధాన ఘటనల్లో ఏకంగా 240 మంది మరణించడం కలచివేస్తోంది. ఈ ఒక్క నెలలో జరిగిన విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై పలు ప్రశ్నల్ని లేవనెతుతున్నాయి.
దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్‌వేపై దూసుకువెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొంది. వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులోని ఇద్దరు సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవదహనం చెందారు. దక్షిణ కొరియా విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు.
డిసెంబర్ 25న అజర్బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయల్దేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గర్లో ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొనడంతో కుప్ప కూలి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 37 మంది అజర్బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్థానీలు, ముగ్గురు కిర్గిస్థానీ పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో 38 మంది దుర్మరణం పాలయ్యారు. 27 మంది గాయపడ్డారు.
డిసెంబర్ 22న మూడు ప్రమాదాలు.. 19 మంది మృతి
డిసెంబర్ 22న బ్రెజిల్లో సంభవించిన విమాన ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశీ ప్రయాణికులతో వెళుతున్న ఓ బుల్లి విమానం ఆదివారం దక్షిణ బ్రెజిల్ టూరిస్ట్ సిటీ గ్రామాడోలోని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో పది మంది ఉండగా.. వారంతా ప్రాణాలు కోల్పోయారు. క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అందరూ పండుగ కోసం ముస్తాబవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం స్థానికుల్లో విషాదాన్ని నింపింది.
ఇక అదే రోజుటర్కీలో కూడా ఇలాంటి ప్రమాదమే సంభవించింది. వైద్యులతో బయల్దేరిన అంబులెన్స్ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. రోగిని తీసుకొచ్చేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ హాస్పిటల్ భవనాన్ని ఢీకొట్టి, కుప్పకూలింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, ఒక ఆరోగ్య సంరక్షకుడు చనిపోయారు. టర్కీ ఆగ్నేయప్రాంతంలోని ముగ్లా నగరంలో డిసెంబర్ 22 ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 22న పాపువా న్యూ గునియాలో నార్త్ కోస్ట్ ఏవియేషన్ నిర్వహిస్తున్న చిన్న విమానం కూలి అందులో ఉన్న 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
డిసెంబర్ 24న అర్జెంటీనాలో బార్డియర్ ఛాలెంజర్ 300 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. డిసెంబర్ 17న హవాయిలోని హోనోలులులోని ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. విమానం లిఫ్ట్‌ఆఫ్ అయిన వెంటనే నియంత్రణ కోల్పోయి భవనాన్ని ఢీట్టింది.
Also Read..
South Korea | దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 179 మంది దుర్మరణం
Netanyahu | నెతన్యాహుకు ప్రొస్టేట్ గ్రంథి శస్త్రచికిత్స విజయవంతం.. ప్రకటించిన వైద్యులు
Jimmy Carter | అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ కన్నుమూత