South Korea | సియోల్: దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్‌వేపై దూసుకువెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొంది. వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులోని ఇద్దరు సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవదహనం చెందారు. దక్షిణ కొరియా విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలోని మువాన్ పట్టణంలో ఈ ఘోరం జరిగింది. జేజూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం బ్యాంకాక్ నుంచి తిరిగివస్తుండగా ఆదివారం ఉదయం 9.03 గంటలకు ప్రమాదానికి లోనైంది. ఈ ఘటనలో 83 మంది మహిళలు, 82 మంది పురుషులు, మరో 11 మంది గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 179 మంది వరకు మరణించారని అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని కాపాడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిద్దరూ స్పృహలోనే ఉన్నారని, వారి ప్రాణాలకు ప్రమాదమేదీ లేదని అధికారులు చెప్పారు.
దక్షిణ కొరియా టెలివిజన్ చానెళ్లు విడుదల చేసిన వీడియోలో జేజూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపైన వేగంగా దూసుకెళుతున్న దృశ్యం కనిపించింది. ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ తెరుచుకోకపోవడం కూడా ఆ వీడియోలో కనిపించింది. రన్‌వేను దాటుకుని ముందుకు దూసుకెళ్లిన విమానం ప్రహరీ గోడను ఢీకొనడం, వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం ఆ వీడియోలో కనిపించింది. విమానం పూర్తిగా దగ్ధమైందని, కేవలం వెనుకభాగం శకలాలు మాత్రమే మిగిలాయని మువాన్ అగ్నిమాపక కేంద్రం చీఫ్ లీ జియాంగ్ హియాన్ తెలిపారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని, విమానాన్ని పక్షి ఢీకొని ఉండవచ్చా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
విమానం ల్యాండింగ్ కావడానికి ముందు పక్షులు ఢీకొనే అవకాశం ఉన్నట్టు ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ జేజూ విమాన పైలట్లకు హెచ్చరిక జారీచేసిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. విమానాన్ని వేరే ప్రదేశంలో ల్యాండింగ్ చేయాలంటూ కంట్రోల్ టవర్ విమానం పైలట్లకు సూచనలు జారీ చేసినట్టు వారు చెప్పారు. రన్‌వేపైన విమానం అదుపుతప్పి వేగంగా ముందుకు దూసుకెళ్లడానికి కొన్ని క్షణాల ముందు విమానం పైలట్ ప్రమాదంలో చిక్కుకున్నట్టు సందేశాలు పంపించారని అధికారులు తెలిపారు. విమానం డాటాను, బ్లాక్ బాక్స్‌కు చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను ఎయిర్‌పోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని రవాణా శాఖ అధికారి జూ జాంగ్-వాన్ తెలిపారు. వీటిని ప్రభుత్వ నిపుణులు దర్యాప్తు చేసి ప్రమాదం వెనుక కారణాలను కనుగొంటారని ఆయన చెప్పారు. జనవరి 1 వరకు మువాన్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు.
విమాన ప్రమాదంపై జేజూ ఎయిర్ అధ్యక్షుడు కిమ్ ఇ-బే మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలిపారు. ప్రమాదానంతరం పరిణామాలను చక్కదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు తాను క్షమాపణలు చెబుతున్నానని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని తన సహ ఉద్యోగులతో కలసి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రమాదానికి గురైన విమానానికి రెగ్యులర్ చెకప్‌లు జరిగినపుడు మెకానికల్ సమస్యలు ఉన్నట్టు ఎన్నడూ గుర్తించలేదని తెలిపారు. అయితే ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడయ్యే ఫలితాల కోసం తాము కూడా ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.