బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 01:35:24

236కు చేరిన కరోనా కేసులు

236కు చేరిన కరోనా కేసులు

-మహారాష్ట్రలో అత్యధిక మందికి వైరస్‌

న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 32 మంది విదేశీయులతోపాటు 50 కొత్త కేసులు నమోదు కావడంతో శుక్రవారం వరకు దీని బారిన పడిన వారి సంఖ్య 236 మందికి చేరుకున్నది. వీరిలో ఇప్పటి వరకు నలుగురు (ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున) మరణించారు. 20 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. వైరస్‌ పాజిటివ్‌ నమోదైన విదేశీయుల్లో 17 మంది ఇటలీ, ముగ్గురు ఫిలిప్పీన్స్‌, ఇద్దరు బ్రిటన్‌, కెనడా, ఇండోనేషియా, సింగపూర్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. దేశవ్యాప్తంగా 6700 మందిపై ఆరోగ్య శాఖ నిఘా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ మహమ్మారిపై వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్న వారిపై ఫిర్యాదు చేయడానికి ‘1075’ నంబర్‌తో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఫోన్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాలను కుదించుకోవాలని, అతిథి ఫ్యాకల్టీని ఆహ్వానించడం దాటవేయాలని ప్రభుత్వ రంగ శిక్షణా సంస్థలను కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ కోరింది. మరోవైపు వచ్చేవారం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన శ్రీరామ్‌ మేళాను సస్పెండ్‌ చేశారు. అనుమానితులను క్వారంటైన్‌ సెంట్లరకు తరలించే అధికారాన్ని కేంద్రం రాష్ర్టాలకే అప్పగించింది.


logo