(స్పెషల్ టాస్క్ బ్యూరో):హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘తూర్పు ఆసియాలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకొంటున్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఈ మాడల్ కావాలా? వద్దా?’ 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. నిజమే.. 27 ఏండ్ల బీజేపీ పాలనలో, మూడు పర్యాయాలు మోదీ సీఎంగా పగ్గాలు చేపట్టిన గుజరాత్లో ఇప్పటికీ ప్రతి ఆరుగురిలో ఒకరు పేదరికంలోనే మగ్గిపోతున్నారు.
గుజరాత్ కంటే మెరుగ్గా 23 రాష్ర్టాలు, యూటీలు..
దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) బతుకీడుస్తున్న కుటుంబాల సంఖ్య గుజరాత్లో అంతకంతకూ పెరిగిపోతున్నది. 2020తో పోలిస్తే 2021లో కొత్తగా 2,558 కుటుంబాలు పేదరికంలోకి దిగజారాయి. మొత్తం 1.21 కోట్ల కుటుంబాల్లో బీపీఎల్ క్యాటగిరీలో 31,56,541 కుటుంబాలు (25 శాతం) ఉన్నాయి. ఈ వివరాలు గుజరాత్ ప్రభుత్వమే అసెంబ్లీలో వెల్లడించింది. ప్రతీ ఆరుగురిలో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారని, పేదరికం విషయంలో గుజరాత్‌తో పోలిస్తే దేశంలో 23 రాష్ర్టాలు, యూటీలు మెరుగైన స్థితిలో ఉన్నాయని నీతిఆయోగ్ తేల్చిచెప్పింది. ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థికమంత్రి కన్నూదేశాయ్ మాట్లాడుతూ.. గడిచిన 20 ఏండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,14,809కి పెరిగిందని తెలిపారు. సామాజిక-ఆర్థిక సర్వే ప్రకారం మాత్రం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,60,028 గానే ఉండటం గమనార్హం.