న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తెలిపారు. గత ఐదేళ్లలో ఇటువంటి నేరస్తులను అప్పగించాలని కోరుతూ 178 లేఖలు రాయగా వీటిలో 65 లేఖలు అమెరికా అధికారుల పరిశీలనలో ఉన్నాయని మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. గత ఐదేళ్లలో 23 మంది పారిపోయిన నేరస్తులను అమెరికా నుంచి భారత్కు రప్పించినట్టు ఆయన చెప్పారు.
ముంబై, డిసెంబర్ 11( నమస్తే తెలంగాణ): బాబాసాహెబ్ అంబేదర్ విగ్రహం ముందు ఉన్న రాజ్యాంగ ప్రతిరూపం ధ్వంసాన్ని నిరసిస్తూ అంబేద్కర్ అభిమానులు బుధవారం మహారాష్ట్రలోని పర్భణిలో చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కర్ఫ్యూ విధించినా ఆందోళనకారులు లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించగా, జనం పోలీసులపై రాళ్లు రువ్వారు.