Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 1: అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరు తమ తమ ప్రాంతాల్లో దీపాలు, హారతి, ప్రసాదాల పంపిణీ చేపట్టాలని కోరారు.
రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాహకులు అక్షింతల పంపిణీని ప్రారంభించారు. జనవరి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అక్షింతలతోపాటు రామమందిరం ఫొటో, కట్టడం గురించి వివరించే కరపత్రాన్ని ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల సమీపంలోని ప్రజలకు వీటిని అందజేస్తారు. ప్రజలు దేవాలయాల వద్దకు వెళ్లి, ఈ అక్షింతలను స్వీకరించవలసి ఉంటుంది. ఈ పంపిణీ కార్యక్రమాలను వీహెచ్‌పీ, ఆరెస్సెస్, వాటి అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్నాయి.
అయోధ్య, జనవరి 1: కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహం అయోధ్య మందిరంలో ప్రతిష్ఠాపనకు ఎంపికైందని ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఎక్స్‌లో ఆయన తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం ప్రతిష్ఠాపనకు ఎంపిక కావడం రాష్ట్రంలోని రామభక్తుల సంతోషాన్ని, గౌరవాన్ని రెండింతలు చేసింది. యోగిరాజ్‌కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు. దీనిపై శిల్పి యోగిరాజ్ స్పందిస్తూ తన విగ్రహం ఎంపికైన విషయమై అధికారిక సమాచారం లేదన్నారు.
అయోధ్య రామమందిరం కొలువుదీరనున్న వేళ.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 వేల అడుగుల ఎత్తులో రామమందిర జెండా రెపరెపలాడింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామిక శర్మ(22) బ్యాంకాక్‌లో రామమందిర జెండాతో ఆకాశంలో చక్కర్లు కొట్టారు.