న్యూఢిల్లీ: ఢిల్లీలో బలమైన డస్ట్ స్టార్మ్(Dust Storm) వచ్చింది. తీవ్రంగా వీచిన గాలుల వల్ల.. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది పడ్డారు. సుమారు 205 విమానాలు ఆలస్యం అయ్యాయి. దాదాపు 50 విమానాలకు చెందిన నిర్దేశిత డెస్టినేషన్‌ను మార్చేశారు. సగటున ప్రతి విమానం గంట ఆలస్యంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దుమ్ము తుఫాన్ రావడంతో అనేక విమానాలను డైవర్ట్ చేశారు. కొన్నింటిని రద్దుచేశారు. దీంతో విమానాల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది.
విమానాలు డైవర్ట్ చేయడం వల్ల.. విమానాశ్రయంలో రష్ పెరిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి సాయంత్రం 6 గంటలకు రావాల్సిన విమానాన్ని.. డస్ట్ స్టార్మ్ వల్ల చండీఘడ్‌కు దారి మళ్లించారు. అయితే ఆ విమానం మళ్లీ రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకున్నది. దీంతో ప్రయాణికుల అవస్థలు పడినట్లు ఓ ఎయిర్ ఇండియా ప్యాసింజర్ తెలిపారు.
ఢిల్లీ నుంచి ముంబైకి రాత్రి 12 గంటలకు వెళ్లాల్సిన విమానాన్ని కూడా ఆలస్యం చేశారు. నాలుగు గంటల పాటు విమానంలో కూర్చున్న తర్వాత మరో విమానంలోకి ఎక్కించారని, తెల్లవారినా కూడా తమ విమానం కదలడం లేదని మరో ప్యాసింజెర్ చెప్పారు.