పట్నా: 2013 నాటి పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితులకుగాను 9 మందిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మరో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. 2013 సాధారణ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ పట్నాలోని గాంధీ మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. హూంకార్ ర్యాలీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది.
సభా ప్రాంగణంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు సంభవించగా అందులో రెండు బాంబులు వేదికకు కేవలం 150 మీటర్ల లోపు దూరంలోనే చోటుచేసుకున్నాయి. ఆఖరి బాంబు.. మోదీ సభ వద్దకు రావడానికి 20 నిమిషాల ముందు పేలింది. ఆ తర్వాత నాలుగు లైవ్ బాంబులు అధికారులు నిర్వీర్యం చేశారు. ఈ పేలుళ్లలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 70 మందికిపైగా గాయపడ్డారు.