పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో రెండే వేల ఏళ్ల క్రితం నాటి ఇటుక గోడలు బయటపడ్డాయి. కుమ్రాహర్ ప్రాంతంలో ఉన్న చెరువును పునరుద్దరిస్తున్న సమయంలో ఆ గోడలను గుర్తించినట్లు పురావాస్తుశాఖ సర్కిల్ సూపరింటెండెంట్ గౌతమి భట్టాచార్య తెలిపారు. పాట్నా రైల్వే స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్రాహర్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన తవ్వకాల్లో ఈ విషయం తెలిసింది. అమృత్ సరోవర్ ప్రాజెక్టు కింద చెరువులను పునరుద్దరిస్తున్నారని, దీనిలో భాగంగా జరిగిన తవ్వకాల్లో ఆ ఇటుకలు బయటపడినట్లు గౌతమి తెలిపారు. ఈ ఇటుక గోడలు కుషాన్ యుగానికి చెంది ఉంటాయని భావిస్తున్నారు. ఏడీ 30 నుంచి 375 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాలో కొన్ని భాగాలు కుషాన్ పాలన కింద సాగాయి. కానీ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత దీనిపై ఓ కొలిక్కి రావచ్చు అన్నారు. ఢిల్లీ పురావాస్తుశాఖ అధికారులు ఈ సమాచారాన్ని చేరవేశామని, కేంద్ర స్కీమ్ కింద బీహార్లో 11 చెరువులను పునరుద్దరిస్తున్నట్లు గౌతమి వెల్లడించారు.