కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రికి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన సుమారు 60 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి వేరే కుంపటి పెట్టుకున్నారు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోని మమతకు పార్టీకి చెందిన ఎంపీలు కూడా అదే మార్గంలో పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు.
28 ఏండ్ల పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని టీఎంసీ ఎదుర్కొంటున్నది. టీఎంసీకి చెందిన ఎంపీల్లో సగం మంది బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. సుమారు 20 మంది ఎంపీలు కమలం పార్టీలో చేరేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం టీఎంసీకి లోక్సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది కలిపి మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 20 మంది పార్టీని మారితే పార్లమెంట్లో ఆ పార్టీ బలం సగానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం పార్లమెంట్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలున్న పార్టీ టీఎంసీయే.