బెంగళపూర్ : హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యాసంస్థలకు దగ్గరలో సమావేశాలు, నిరసనలు చేపట్టకుండా రెండు వారాల పాటు నిషేధం విధించింది. బెంగళూరు వ్యాప్తంగా నిరసనలపై నిషేధం తక్షణం అమలులోకి వస్తుదని పేర్కొంది. 200 మీటర్ల పరిధిలో ఎలాంటి సమూహాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు అమలు చేపట్టేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నట్లు గుర్తించామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని చోట్ల నిరసనలు హింసకు దారి తీశాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయని.. బెంగళూరు నగరంలోనూ ఇలాంటి ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో నిషేధం విధించినట్లు పేర్కొంది. ఉత్తర్వులతో ఎవరైనా ప్రతికూలంగా ప్రభావితమైనట్లు భావిస్తే ఆర్డర్‌ను సవరించేందుకు, రద్దు చేసేందుకు సంబంధిత శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి అప్పీల్ చేయొచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. హిజాబ్ అంశంపై విచారణ జరిపిన హైకోర్టుకు సింగిల్ బెంచ్ జడ్జి.. పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.