న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: యాసంగి పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత పన్నెండేండ్లలో అత్యంత కనిష్ఠంగా గోధుమలకు ఈసారి 2 శాతం (రూ.40) మాత్రమే మద్దతు ధరను పెంచింది. తాజా పెంపుతో గోధుమల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,015కి చేరింది. గోధుమతోపాటు మరో ఐదు పంటలకు కేంద్రం ఎంఎస్పీని ప్రకటించింది. పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం పేర్కొన్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సమావేశం అనంతరం కేంద్రమంత్రులు పీయూష్, అనురాగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
జౌళి రంగానికి దన్ను
దేశీయంగా తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు జౌళి రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం కింద రూ. 10,683 కోట్లను కేటాయిస్తున్నట్టు క్యాబినెట్ కమిటీ వెల్లడించింది. వచ్చే ఐదేండ్లలో ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ పథకం వల్ల కొత్తగా 7 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంకోవైపు, భూగర్భ పరిశోధనల కోసం భారత్, రష్యా మధ్య కుదిరిన ఒప్పందానికి, అజర్‌బైజాన్‌కు చెందిన చాంబర్ ఆఫ్ ఆడిటర్స్‌కు ఐసీఏఐకు మధ్య కుదిరిన ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం లభించింది. పోర్చుగల్‌లో భారతీయులు ఉద్యోగాలు చేసేందుకు వీలుకల్పించే ఒప్పందానికీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.