డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అలనకంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇంకా పది మంది యాత్రికుల ఆచూకీ తెలియడంలేదు. టెంపో ట్రావెలర్ వాహనంలో వెళ్తున్న భక్తుల బస్సు నదిలో పడినట్లు పోలీసులు వెల్లడించారు. రుద్రప్రయాగ్ నుంచి గౌచార్ మార్గమధ్యంలో ఉన్న బ్రదీనాథ్ జాతీయ రహదారిపై గోల్తిర్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రిలీఫ్, రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి.
నది నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. రుద్రపయాగ్ దగ్గర ఓ మృతదేహాన్ని గుర్తించారు. గాయపడినవారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన సత్యేంద్ర సింగ్ భండారి తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్‌తో సహా 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 7.30 నిమిషాలకు ప్రమాదం జరిగింది. భక్తులు బద్రీనాథ్‌కు వెళ్తున్నట్లు సమాచారం. టెంపోలో ఉన్నవారంతా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి చార్‌థామ్ యాత్రకు వచ్చారు.