లక్నో: గాయపడిన కుక్కను చూసి ఇద్దరు పిల్లలు చలించిపోయారు. అట్టపెట్టెతో బండిని తయారు చేశారు. గాయంతో బాధపడుతున్న కుక్కను అందులో ఉంచి పశు వైద్యశాలకు తీసుకెళ్లారు. (Kids Carry Injured Dog In Makeshift Trolley) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఒక వీధి కుక్క గాయపడటాన్ని ఇద్దరు పిల్లలు చూశారు. అట్ట పెట్టెతో చక్రాల బండిని తయారు చేశారు. కుక్కను అందులో ఉంచి పశువైద్యశాలకు తరలించారు. చికిత్స తర్వాత అట్ట పెట్టె బండిలో దానిని ఉంచి ఇంటికి తిరిగి వెళ్లారు. పెద్ద పిల్లవాడు తాడుతో ఆ బండిని లాగగా, చిన్న పిల్లవాడు వెనుక నుంచి దానిని తోశాడు.
కాగా, గాయపడిన కుక్కకు చికిత్స కోసం అట్టపెట్టె బండిలో ఉంచి మండుటెండలో పశువైద్యశాలకు పిల్లలు తీసుకెళ్లిన ఈ సంఘటనను ఒక వ్యక్తి రికార్డ్ చేశాడు. మే 14న ‘స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే’ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో జంతువుల పట్ల ఆ పిల్లలు చూపిన ప్రేమ, దయకు నెటిజన్లు ముగ్ధులయ్యారు. వారి చర్యను పలువురు ప్రశంసించారు.