న్యూఢిల్లీ: రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు (Bomb threat) వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం రెండు ఆసుపత్రులకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం 3.15 గంటలకు తొలుత బురారీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.26 గంటల సమయంలో సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు రెండో బెదిరింపు వచ్చిందని చెప్పారు. బాంబు స్క్వాడ్ ద్వారా ఈ రెండు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పరికరాలను గుర్తించలేదని ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ మనోజ్ మీనా తెలిపారు.
కాగా, ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని 130కుపైగా స్కూళ్లలో బాంబులు ఉన్నట్లుగా ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో దేశ రాజధానిలో భయాందోళనలకు ఇది దారితీసింది. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అన్నది తెలుసుకునేందుకు ఇంటర్‌పోల్ ద్వారా రష్యన్ మెయిలింగ్ సర్వీస్ కంపెనీ మెయిల్.ఆర్యూ ను సంప్రదించారు.