లక్నో: కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. (Car, Truck Collision) ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మరణించారు. గూగుల్ మ్యాప్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హర్యానాలోని రోహ్తక్కు చెందిన నలుగురు స్నేహితులైన శివాని, సిమ్రాన్, రాహుల్, సంజు కలిసి కారులో ప్రయాణించారు. నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత నైనిటాల్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి వేళ ఢిల్లీ-లక్నో హైవేపై సిమ్మెంట్ పైపుల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో కారు డోర్లు లాక్ అయ్యాయి. దట్టంగా పొగలు అలముకున్నాయి.
కాగా, గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కారు డోర్స్‌ను బ్రేక్ చేశారు. అందులో ఉన్న నలుగురిని బయటకు తీశారు. అయితే యువతులైన శివాని, సిమ్రాన్ సహాయం కోసం ఎదురు చూస్తూ ఈ ప్రమాదంలో మరణించారు. మరో ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో గూగుల్ మ్యాప్ పొరపాటు వల్ల ఆ కారు బైపాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పుగా మలుపు తిరుగడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.