రావలకోట్, జూన్ 11 : పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావలకోట్లో నిరసనకారులపై భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. తమకు మరిన్ని పౌర హక్కులు కల్పించాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన నిరసన ప్రదర్శనపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. గోధుమ పిండి, బియ్యం, విద్యుత్తు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేల సంఖ్యలో వచ్చిన ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా ఒక్కసారి కలకలం రేగింది.
సుమారు 60 వేల నుంచి 70 వేల మంది వరకు తరలివచ్చిన ఆందోళనకారులపై పాక్ సైన్యం, రేంజర్లు ఒక్కసారిగా కాల్పులకు దిగారని స్థానికులు తెలిపారు. ఈ కాల్పుల్లో 16 మంది మృత్యువాత పడగా, 37 మంది వరకు గాయపడ్డారని పేర్కొన్నారు. గత శుక్రవారం నుంచి పీవోకేలో జరుగుతున్న అల్లర్లు, వాటిని అణచివేసే పేరిట జరిగిన సైనిక చర్యలో 53 మంది సాధారణ పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. రావలకోట్లో జరిగిన తాజా కాల్పులతో గురువారం పీవోకే అంతటా ఆందోళన నెలకొంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.