భువనేశ్వర్: బీజేపీ నేతలు ప్రయాణించిన కారును డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీజేపీ నేతలు మరణించారు. (BJP Leaders Killed) మరికొందరు గాయపడ్డారు. అయితే ఉద్దేశపూర్వకంగానే డంపర్ డ్రైవర్ తమ కారును ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొందరు బీజేపీ నేతలు కారులో భువనేశ్వర్ నుంచి కర్డోలాకు తిరిగి వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్‌హెచ్ 53లో ఆ కారును డంపర్ ఢీకొట్టింది. దీంతో అది బోల్తా పడింది. బీజేపీ గోశాల మండల అధ్యక్షుడు దేబేంద్ర నాయక్, మాజీ సర్పంచ్ మురళీధర్ చురియా ఈ ప్రమాదంలో మరణించారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు బీజేపీ నేతలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, డంపర్ డ్రైవర్ తమ కారును మూడు సార్లు ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేత సురేష్ చందా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం కలిగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డంపర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.