(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిళ్లకు ప్రధానమంత్రి మోదీ తలొగ్గారా? ఆప్తమిత్రుడు అదానీపై అమెరికాలో కేసులు కొనసాగుతుండటం, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ప్రస్తావనకు రావడం, సుంకాల విషయంలో తన దౌత్యం విఫలమవ్వడం.. వెరసి సర్వత్రా విమర్శలు వస్తుండటంతో దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన ట్రేడ్ డీల్‌ను ప్రధాని మోదీ ఉన్నపలంగా ఖరారు చేశారా? ఈ ట్రేడ్ డీల్‌తో భారత్ కంటే అమెరికాకే ఎక్కువ లాభం అని తెలిసినప్పటికీ, దేశ ప్రయోజనాలను మోదీ తాకట్టుపెట్టారా? ప్రతిపక్ష నాయకుల విమర్శలు, సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని అద్భుతమైనదిగా అధికార నేతలు ప్రచారం చేసుకొంటున్నా.. ఈ డీల్‌తో అమెరికాకే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతున్నట్టు ఆర్థికరంగ నిపుణులు, విపక్షాలు చెబుతున్నాయి.
ట్రంప్ సర్కార్‌తో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి పలు కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో మొదటిది అదానీ వ్యవహారం. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసు ఇటీవలే చివరి దశకు చేరినట్లయ్యింది. అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ప్రకారం.. నేరం రుజువైతే గౌతమ్ అదానీకి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఆప్తమిత్రుడిని కాపాడటానికే మోదీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గినట్టు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, అమెరికన్ ఫైనాన్షియల్, లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోదీ పేరు ఇటీవల బయటకు వచ్చింది. ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయోజనాల కోసం మోదీ పని చేసినట్టు అమెరికా న్యాయశాఖ సదరు పత్రాల్లో వెల్లడించింది. సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో మోదీ పేరు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే మోదీ అమెరికాతో డీల్ కుదుర్చుకొన్నట్టు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిడికి ట్రంప్ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అరోపించారు. ఈ ఒప్పందం చేసుకొని రైతుల కష్టాన్ని, మొత్తంగా దేశాన్నే మోదీ అమ్మేశారని మండిపడ్డారు. అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు ఉండటం, ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ప్రస్తావనకు రావడంతో మోదీ రాజీపడ్డారని ఆరోపించారు.
మాస్కో: తమ దేశం నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేస్తున్నట్టు భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రష్యా మంగళవారం వెల్లడించింది. తాము భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని పునరుద్ఘాటించింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే రష్యా ఈ విధంగా స్పందించింది. రష్యా నుంచి చమురు నిలిపేస్తామని ఒప్పుకొన్నందునే భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలను నిశితంగా విశ్లేషిస్తున్నామని చెప్పారు. భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు.