న్యూఢిల్లీ : ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే మొత్తం 9 రాష్ట్రాల్లో 1700 మంది డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాబోయే రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కేసుల సంఖ్య కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ డేంజరస్ అని డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లో 400 మంది డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. కలకత్తా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషన్ మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఎస్ హాస్పిటల్లో అధికంగా కేసులు నమోదు అయ్యాయి.
బీహార్‌లో 300 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. ఇక్కడ నలంద మెడికల్ కాలేజీతో పాటు అనుగ్రహ్ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
మహారాష్ట్రలోనూ 300 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. సియాన్ ఆస్పత్రిలోనే 98 మంది డాక్టర్లకు కొవిడ్ సోకగా, జేజే హాస్పిటల్లో 83 మంది పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. కేఈఎమ్ హాస్పిటల్లో 73 మంది డాక్టర్లకు, నాయర్ ఆస్పత్రిలో 59 మంది వైద్యులకు కరోనా సోకింది.
ఉత్తరప్రదేశ్‌లో 75 మంది డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. లక్నోలోని మేధాంత ఆస్పత్రిలో 56 మంది వైద్యులకు కరోనా సోకింది. లోక్‌బంధు ఆస్పత్రిలో ముగ్గురికి, కేజీఎంయూ ఆస్పత్రిలో ఆరుగురు కరోనా బారిన పడ్డారు.
జార్ఖండ్‌లో మొత్తం 179 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా బారిన పడగా, ఇందులో డాక్టర్లు, నర్సులు ఉన్నారు.
ఢిల్లీలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 100 మంది ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బారిన పడ్డారు. కరోనా నివారణకు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.
చండీఘర్‌లో 196 మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. వీరంతా పీజీఐ, సిటీ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 33 మంది డాక్టర్లకు కొవిడ్ సోకింది. బిలాస్పూర్లో 40 మంది డాక్టర్లు, 35 మంది నర్సులు, మరో 30 మంది వర్కర్లు కరోనా బారిన పడ్డారు. రాయ్‌ఘర్‌లోని లఖిరామ్ మెడికల్ కాలేజీలో ముగ్గురు డాక్టర్లకు కొవిడ్ సోకగా, రాజ్‌నంద్‌గావ్ పెండ్రి మెడికల్ కాలేజీలో 14 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు.
రాజస్థాన్‌లో 48 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా సోకింది.