Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఐఐటీ-జేఈఈకి సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అతడు విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే, సదరు విద్యార్థి శుక్రవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాన్‌కు యాంటీ హ్యాంగింగ్ డివైజ్ ఉన్నప్పటికీ అది పని చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 17వ ఘటన కావడం గమనార్హం. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
మరోవైపు, విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థానం ప్రభుత్వం ఇటీవలే నివారణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం యాంటీ హ్యాంగింగ్ డివైజ్ పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
LPG tanker blast | ఎల్పీజీ ట్యాంకర్ పేలుడు ఘటనలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. 30 మంది పరిస్థితి విషమం
Drugs | పటాన్చెరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
PM Modi: 2 రోజుల కువైట్ పర్యటనకు ప్రధాని మోదీ