న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో దవాఖానకు తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 20 మంది జవాన్లు ఉన్నారు. వందల అడుగుల ఎత్తు నుంచి లోయలో పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకొన్న రెస్క్యూ సిబ్బంది, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్లకు చెందిన మూడు వాహనాల కాన్వాయ్ చట్టేన్ నుంచి థంగు ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకొన్నదని ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. జవాన్ల మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సైన్యం, బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. రోడ్డు ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీర జవాన్లను కోల్పోవడం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్లు, అధికారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.