న్యూఢిల్లీ : భారత్లో 2021లో 4.12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,53,972 మంది మరణించారని ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. 3,84,448 మంది ఈ ప్రమాదాల్లో గాయపడ్డారని, 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం పెరిగాయని వెల్లడైంది.
రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలైన వారి సంఖ్య 16.9 శాతం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య 10.39 శాతం పెరిగిందని గణాంకాలు పేర్కొన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 1,28,825 ప్రమాదాలు ఎక్స్ప్రెస్ వేలు సహా జాతీయ రహదారులపై చోటుచేసుకున్నాయి.
96,382 యాక్సిడెంట్లు రాష్ట్ర రహదారులపై 1,87,225 యాక్సిడెంట్లు ఇతర రోడ్లపై జరిగాయి. ఇక జాతీయ రహదారులపై 56,007 మంది ప్రాణాలు కోల్పోగా, రాష్ట్ర రహదారులపై 37,963 మంది మృత్యువాతన పడ్డారని 2021లో భారత్లో రోడ్డు ప్రమాదాలు పేరిట మంత్రిత్వ శాఖ వెల్లడించిన వార్షిక నివేదిక పేర్కొంది.