Republic Day | న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా 1,500 మంది రైతు దంపతులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాలకు రైతు దంపతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం ఇదే తొలిసారి అని చెప్పారు.
దేశంలోని అన్ని ప్రాంతాల వారిని ఎంపిక చేసి ఆహ్వానించామన్నారు. వ్యవసాయోత్పత్తుల సంఘాల ప్రతినిధులు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, చిన్న తరహా నీటిపారుదల పథకాల లబ్ధిదారులు వీరిలో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వీరికి విందు ఇస్తారని చెప్పారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలకు దాదాపు 500 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు.