Murder : దేశరాజధాని ఢిల్లీ (Delhi) లో దారుణం జరిగింది. రాత్రి భోజనం తినడానికి కూర్చున్న 15 ఏళ్ల బాలుడిని బయటికి తీసుకెళ్లి దారుణంగా హత్యచేశారు. కర్దమ్పురి (Kardampuri) లోని జ్యోతినగర్ (Jyoti Nagar) లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బాలుడు భోజనం చేసేందుకు కూర్చున్న సమయంలో అతడి స్నేహితుడు అమన్ వచ్చాడు. మళ్లీ వద్దాం రమ్మంటూ అతడిని బయటికి తీసుకెళ్లాడు. బాలుడి తల్లి వారిస్తున్నా వినకుండా బయటి నుంచి గడియ పెట్టి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కాసేపటికే ఇరుగుపొరుగు తలుపులు తీసి బాలుడు కత్తిపోట్లకు గురైన విషయాన్ని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా గొడవ గురించి వెంటనే సమాచారం ఇచ్చినా పోలీసులు ఆలస్యంగా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు.