Pune : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పూనే పరిధిలో వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ కూలిపోవడంతో, శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూనే పరిధి పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లోని మోహ్సి ఏరియాలో బుధవారం జరిగింది. ఇక్కడి ఒక వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లో మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. భారీ వర్షాల కారణంగా ఈ బిల్డింగ్ కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో అందులో పని చేస్తున్న 16 మంది సిబ్బంది చిక్కుకుపోయారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సేఫ్టీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రవి లాగ్డే స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగులో 16 మంది పని చేస్తున్నారని, బిల్డింగ్ కూలిన తర్వాత అందులోంచి ఇద్దరు బయటపడ్డారని రవి తెలిపారు. మిగిలిన వారు శిథిలాల కింద చిక్కుకోగా, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం అందరినీ సురక్షితంగా తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే, క్షతగాత్రులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
పూనే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ పరిధిలో వర్షాల కారణంగా వరదలాంటి పరిస్తితి ఉంది. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాదాపు 6,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక, మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ముంబైలోని మంఖుర్డ్ ప్రాంతంలో వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ కూలడంతో ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.