High Temperatures | న్యూఢిల్లీ, జూలై 31: వాతావరణ మార్పులతో 2040 నాటికి భారత్లోని 15 తీర ప్రాంత నగరాలు ముంపు ముంగిట ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సముద్రమట్టాలు పెరిగి విశాఖపట్టణంలో 5 శాతం భూమి నీట మునిగే ప్రమాదముందని బెంగళూరుకు చెందిన మేథో సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ’ నివేదిక ప్రకారం, 2040 నాటికి ముంబై, పనాజీ, చెన్నై నగరాల్లో 10 శాతం భూమి, విశాఖపట్టణం, కొచ్చి, మంగళూరు, ఉడిపి, పూరీ నగరాల్లోని 5 శాతం భూమి నీట మునిగే అవకాశముంది. 1987 నుంచి 2021నాటికి విశాఖ తీరంలో సముద్ర మట్టం 4.440 సెంటీమీటర్ల ఎత్తు పెరగగా, అత్యధికంగా ముంబైలో 4.440 సెంటీమీటర్లు, హల్దియాలో 2.726 సెంటీమీటర్లు, కొచ్చిలో 2.213 సెంటీమీటర్లు చొప్పున సముద్ర మట్టాలు పెరిగాయని అధ్యయనం వివరించింది.