ముంబై: ఇన్నాళ్లు కరోనాతో వణికిపోయిన మహారాష్ట్రను సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ఆందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కొత్త రూపంలో వచ్చిన మహమ్మారిని నిలువరించడానికి మహానగరం ముంబైలో నేడు, రేపు 144 సెక్షన్ అమలుచేస్తున్నది. రెండు రోజులపాటు ర్యాలీలు, బహిరంగ సభలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. ప్రజలు బయట తిరగడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ఆదేశాలను ధిక్కరించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా ఏడు ఒకమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది. ఇందులో ముంబైలో మూడు కేసులు ఉండగా, పింప్రి ప్రాంతంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. ముంబైలో ఒమిక్రాన్ బారినపడిన ముగ్గురు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని అధికారులు తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 17, రాజస్థాన్ 9, గుజరాత్ 3, కర్ణాటక 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఉన్నాయి.