న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం అట్టుడికాయి. భద్రతా లోపాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటనలు చేయాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయటంతో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదేమంత పెద్ద విషయం కాదని ప్రభుత్వం ప్రకటించటంతో రగడ మరింత ముదిరింది. దీంతో లోక్‌సభ నుంచి 13 మందితోపాటు రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ను సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసేవరకు వారికి సభలోకి ప్రవేశం లేదని ప్రకటించారు.
పార్లమెంటులోకి బుధవారం ఇద్దరు దుండగులు జొరబడి లోక్‌సభ సమావేశ మందిరంలో నానా రభస సృష్టించిన విషయం తెలిసిందే. సభలో గ్యాస్ వదిలి భయోత్పాతం సృష్టించారు. పార్లమెంటు భవనం బయట కూడా ఇద్దరు వ్యక్తులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై గురువారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. హోంమంత్రి వెంటనే వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర కార్యక్రమాలన్నీ రద్దుచేసి భద్రతా లోపాలపై చర్చ చేపట్టాలని ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వీటిని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ తిరస్కరించటంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు లోక్‌సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రభుత్వం కూడా దిగిరాలేదు. మంత్రి రాజ్‌సాథ్ సింగ్ ప్రకటన చేస్తూ.. దేశ రక్షణకు సంబంధించిన విషయంలో విపక్షాలు రాజకీయాలు చేయరాదని అన్నారు. పార్లమెంటు రక్షణ బాధ్యత స్పీకర్ చేతిలో ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఓ ప్రకటన చదివి వినిపించారు. స్పీకర్ ఓంబిర్లా కూడా భద్రతాలోపంపై సభలో ప్రకటన చేశారు. ‘పార్లమెంటు రక్షణ బాధ్యత పార్లమెంటు సెక్రటేరియేట్దే’ అని పేర్కొన్నారు.
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు లోక్‌సభ, రాజ్యసభ నుంచి 15 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్‌సభలో 14 మంది విపక్ష సభ్యులను శీతాకాలం సెషన్ మొత్తం సస్పెండ్ చేసే రెండు తీర్మానాలను ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టారు. మొదట టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ను సస్పెండ్ చేసే తీర్మానాన్ని సభ ఆమోదించిది. ఆ వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. 3 గంటలకు తిరిగి ప్రారంభమైనా ఆందోళన తగ్గకపోవటంతో వీకే శ్రీకందన్, బెన్నీ బెహనన్, మొహమ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కే సుబ్బరాయన్, ఎస్ఆర్ పార్తిబన్, ఎస్ వెంకటేశన్, మానిక్కం ఠాకూర్‌ను సస్పెండ్ చేసే తీర్మానాన్ని జోషీ సభలో ప్రవేశపెట్టడంతో సభ ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో ఆందోళన చేపట్టిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ను చైర్మన్ జగ్దీప్ ధన్కర్ సస్పెండ్ చేశారు. అయినా ఆయన బయటకు వెళ్లకపోవటంతో రూల్ 192 ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన కింద డెరెక్ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేయాలని సభా నాయకుడు పీయూష్ గోయల్ కోరారు. దీనికి ధన్కర్ ఆమోదం తెలిపారు.
ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. సభలు వాయిదా పడిన తర్వాత విపక్ష పార్టీల నాయకులంతా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఖర్గే ట్వీట్ చేస్తూ.. ‘పార్లమెంటుకు, పార్లమెంటు సభ్యులకు తీవ్రమైన భద్రతాలోపం ఏర్పడిన నేపథ్యంలో దీనిపై రెండు సభల్లో కేంద్ర హోంమంత్రి సవివరమైన ప్రకటన చేయాలని ఇండియా కూటమితోపాటు ఇతర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాలని కోరుతున్నాము’ అని పేర్కొన్నారు. సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ నేత అధిర్‌రంజన్ చౌదరి తీవ్రంగా స్పందించారు. ‘ఈ చర్చ ప్రజాస్వామ్యాన్ని హత్యచేయటమే. పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంపుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దుండగులకు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఘటనపై నిరసన తెలిపిన ఎంపీలను సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.
లోక్‌సభలో సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేయటంతోపాటు కేంద్రంపై సెటైర్లు వేశాయి. అందుకు కారణం సభలో లేని ఎంపీ పార్తిబన్‌ను కూడా సస్పెండ్ చేయటమే. డీఎంకే ఎంపీ పార్తిబన్ గురువారం సభకు హాజరు కాలేదు. ఆయన అసలు ఢిల్లీలోనే లేరు. చెన్నైలోనే ఉన్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. కానీ, సస్పెన్షన్ తీర్మానంలో ఆయన పేరును కూడా ప్రహ్లాద్ జోషీ చేర్చటంతో స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనిపై డీఎంకే, కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేశారు. ‘సభలో పెద్ద జోక్ జరిగింది. సస్పెండ్ అయిన ఎంపీల లిస్టులో ఎస్ఆర్ పార్తిబన్ పేరు ఉన్నది. ఆయన గురువారం సభకే రాలేదు. తమిళులను ప్రభుత్వం గుర్తుపట్టడం లేనట్టున్నది’ అని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఎద్దేవా చేశారు. అనంతరం సస్పెన్షన్ జాబితా నుంచి ప్రభుత్వం పార్తిబన్ పేరును తొలగించింది. దీంతో సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 13కు తగ్గింది.