భోపాల్: దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు. (children Lose Eyesight) మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ‘దేశీ పటాకు గన్’గా పిలిచే కార్బైడ్ గన్’ తయారు చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొందరు పిల్లలు వాటిని సొంతంగా తయారు చేసుకున్నారు. అక్టోబరు 18న ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కొందరు వ్యక్తులు రూ. 150 నుంచి రూ. 200 వరకు బహిరంగంగా వీటిని విక్రయించారు.
కాగా, దీపావళి సందర్భంగా బాంబుల మాదిరిగా పేలే ‘కార్బైడ్ గన్’ను పేల్చిన వందలాది మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 122 మంది పిల్లలు కంటి గాయాలతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
మరోవైపు భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లోని అన్ని ఆసుపత్రుల కంటి వార్డులు ఈ తుపాకుల వల్ల గాయపడిన పిల్లలు, యువకులతో నిండిపోయాయి. భోపాల్‌లోని హమీడియా ఆసుపత్రిలో 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరారు. విదిష జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది.
అయితే ‘కార్బైడ్ గన్’ అనేది బొమ్మ తుపాకీ కాదని, ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థమని డాక్టర్లు హెచ్చరించారు. పేలుడు వల్ల రెటీనాను కాల్చే లోహ శకలాలు, కార్బైడ్ ఆవిరి విడుదలవుతాయని తెలిపారు. ఇది కళ్ళకు ప్రత్యక్ష నష్టం కలిగిస్తుందని, పిల్లల కనుపాపలు పగిలి శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని వివరించారు. కొంత మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వీరిలో చాలామంది పూర్తి దృష్టిని తిరిగి పొందలేరని అన్నారు.
కాగా, ‘కార్బైడ్ గన్’ పరికరాలను అక్రమంగా విక్రయించిన ఆరుగురిని విదిష పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్బైడ్ తుపాకులను విక్రయించిన లేదా ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి హెచ్చరించారు.
Also Read:
Sisters Marry Multiple Men | పలువురిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఆ తర్వాత డబ్బు, నగలతో పరార్
Engineering Student Raped | ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.. క్లాస్మేట్ అరెస్ట్