న్యూఢిల్లీ, జూన్ 15: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి లోయలోకి జారి కింద ప్రవహిస్తున్న అలకానంద నదిలో పడిన ప్రమాదంలో 14 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. రిషికేశ్-బద్రినాథ్ హైవేపై రుద్రప్రయాగ్ జిల్లాలోని రైటోలి సమీపంలో టెంపోకు శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుపక్కన నిల్చున్న పలువురికి గాయాలు అయ్యాయి. విపత్తు రక్షక బృందాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. మిగిలినవారిని స్థానిక దవాఖానలకు తరలించారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా విచారణ జరపాలని ఆదేశించారు.