Madhya Pradesh | భోపాల్ : దుర్గామాత నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. దుర్గామాతను నిమజ్జనానికి తరలిస్తున్న ట్రాక్టర్ నదిలో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఖాండ్వా జిల్లాలోని చంబాల్ నదిలో దుర్గామాతను నిమజ్జనం చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో ట్రాక్టర్లో తరలివెళ్లారు. అయితే ట్రాక్టర్ ప్రమాదవశాత్తు చంబాల్ నదిలో పడిపోయింది. దీంతో 13 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు 11 మృతదేహాలను వెలికితీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. జేసీబీ సాయంతో ట్రాక్టర్ను బయటకు వెలికితీశారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం. ఇక గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు.