న్యూఢిల్లీ : భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇటీవల పులి మృతి చెందగా.. విచారణ జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. చింద్వారాలో బుధవారం ఓ పులి చనిపోగా.. ఈ సంవత్సరం చనిపోయిన పులుల సంఖ్య 44కు పెరిగింది. 2021లో పులుల మరణాలు భారీగా నమోదయ్యాయని ఎన్టీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
దీనిపై విచారణ జరుగుతోంది. పులుల మరణాల నివారణకు పలు చర్యలు తీసుకున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. పెట్రోలింగ్ పెంచడంతో పాటు వేటగాళ్లను అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పులుల మరణాలకు అనేక కారణాలు ఉండొచ్చని పేర్కొన్నారు. 2021లో పులి మరణాల సంఖ్య పెరిగిందని, పరిశోధనలు కొనసాగుతున్నాయని NTCAకి చెందిన అధికారి తెలిపారు. మరణాలకు కారణాలను నిర్ధారించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SoP) అవలంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్లో దండోరిలో పులికి విషం కలిపిన ఆహారం అందించడం ద్వారా మృతి చెందినట్లు వార్తలు వెలుడగా.. వాటిని అధికారి కొట్టిపడేశారు. పులుల సంరక్షణకు పెట్రోలింగ్, వేటను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ 30శాతం మరణాలు టైగర్ రిజర్వ్ వెలుపలే సంభవించాయి. ఎన్టీసీఏ ప్రకారం.. ఈ ఏడాది మధ్యప్రదేశ్లో అత్యధికంగా 44 పులులు మరణించగా.. ఆ తర్వాత మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14 మరణాలు నమోదయ్యాయి.