Karnataka | బెంగళూరు, అక్టోబర్ 6: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతన్నలు ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఆ రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత బీజేపీ ప్రభుత్వం కర్షకుల సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో.. కాంగ్రెస్‌కు పట్టం కట్టినా రైతుల బతుకులు మారలేదు. రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వర్షాభావ పరిస్థితులు, పంట నష్టం కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వందల మంది రైతన్నలు తనువు చాలిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 251 మంది అన్నదాతలు అసువులుబాశారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో కరవు ఏర్పడింది. పంట సాగు కోసం ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు తిరిగొచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు గత ఏడాది భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పులు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు వారి పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. అప్పటి బీజేపీ సర్కారు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కర్షకుల కష్టాలను పట్టించుకోకపోవడంతో కాడి వదిలేస్తున్న కర్షకులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం ఇచ్చి, రైతులను ఆదుకోవడంలో విఫలమవడంతో రైతుల బలవన్మరణాలు పెరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
01
అప్పుల కట్టలేక తనువు చాలించిన రైతన్నలకు మరణం తర్వాత కూడా న్యాయం జరగడం లేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 251 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. వారిలో 174 బాధిత కుటుంబాలే పరిహారానికి అర్హులుగా ఇటీవల కర్ణాటక సర్కార్ పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1,219 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నట్టు గణాంకాలు చెబుతుండగా వారిలో చాలా మంది కుటుంబాలకు పరిహారం అందలేదని తెలుస్తున్నది. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కరువు ప్రభావానికి గురైన తాలూకాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 195 తాలూకాలు కరువుతో అల్లాడుతున్నాయని అందులో పేర్కొంది. మరో 32 తాలూకాల్లోనూ అవే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. అయితే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
పంట నష్టపోయి సర్వస్వం కోల్పోయిన ఓ రైతు దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి యత్నించారు. పంట నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాల సాక్షిగా ఆయన ఆత్మహత్నాయత్నం చేయడం కలకలం సృష్టించింది. బెలగావి జిల్లాలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాష్ర్టానికి వచ్చిన కేంద్ర బృందం పంట నష్టాన్ని అంచనా వేసేందుకు పొలానికి రాగా.. జిల్లాకు చెందిన అప్పాసాహెబ్ లక్కుండి వారి ఎదుటే పురుగుల మందు తాగేందుకు విఫలయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ను నివారించి పురుగుల మందు డబ్బా లాక్కున్నారు. 40 ఎకరాల్లో సాగు చేశానని, పంట మొత్తం నాశనం అయిపోయిందని బాధితుడు రోదించారు. అధికారులు, నాయకులు పరామర్శిస్తున్నారే తప్ప.. నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బెళగావి, విజయపుర, బాగల్కోట్, ధార్వాడ్, గడగ్, కొప్పల్, బళ్లారి, విజయనగర్, చిక్‌బళ్లాపూర్, తుమకూరు, చిత్రదుర్గ, దెవనగెరె, బెంగళూరు రూరల్.