Ramesh Chennithala : మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసే ఉన్నామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రమేశ్ చెన్నితాల (Ramesh Chennithala) చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము కలిసికట్టుగానే పోటీ చేయబోతున్నామని ఆయన స్పష్టంచేశారు.
ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కూడా కూటమి నేతలు మరోసారి సమావేశమై సీట్ల పంపకంపై చర్చలు జరుపుతారని రమేశ్ చెన్నితాల చెప్పారు. సీట్ల పంపకంపై కూటిమిలోని మూడు పార్టీల నుంచి నానా పటోల్, సంజయ్ రౌత్, జయంత్ పాటిల్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ, శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి, బీజేపీ పంచన చేరి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కూటమి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత అజిత్‌పవార్ కూడా ఎన్సీపీని చీల్చి మహా సర్కారులో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ క్రమంలో ఇప్పుడు మహారాష్ట్రలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలను చీల్చిన నేతలను ఆదిరిస్తారా.. చీలకలతో కుదేలైన పార్టీలకు అండగా నిలుస్తారా..? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అధికార కూటమి కంటే, ప్రతిపక్ష కూటమి అభ్యర్థుల వైపే ఓటర్లు మొగ్గు చూపారు. అదే ట్రెండ్ కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటిమిదే విజయం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.