సోమవారం 18 జనవరి 2021
National - Jan 03, 2021 , 20:44:35

1200 వలస పక్షుల మృతిపై కలకలం

1200 వలస పక్షుల మృతిపై కలకలం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ పాంగ్ ఆనకట్ట పరిధిలో సుమారు 1200 విదేశీ వలస పక్షులు అనుమానాస్పదంగా మరణించాయి. అంతరించిపోతున్న బార్ హెడ్ గూస్, బ్లాక్ హెడ్ గల్, రివర్ టెర్న్, కామన్ టీల్, షోవెలర్ వంటి పక్షులు చనిపోయిన వాటిలో ఉన్నాయి. కాగా వారం రోజులుగా విదేశీ వలస పక్షులు పెద్ద సంఖ్యలో మరణించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. చనిపోయిన బార్ హెడ్ గూస్‌, కామన్‌ టీల్‌ పక్షులను పాంగ్ డ్యామ్‌ పరిధిలోని ఫతేపూర్ ప్రాంతంలో డిసెంబర్‌ 28న స్థానికులు గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

దీంతో అధికారులు అక్కడకు వచ్చి పరిశీలించడంతోపాటు నాగ్రోటాలోని ధమేటా, గుగ్లారా ప్రాంతాల్లో మరో 421 విదేశీ పక్షులు అనుమానాస్పదంగా మరణించడాన్ని గుర్తించారు. వాటి మరణాల వెనుక కారణాలు తెలుసుకునేందుకు కొన్ని పక్షుల కళేబరాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్,  జలంధర్‌లోని రీజినల్ డిసీజ్ డయాగ్నొస్టిక్ లాబొరేటరీకి పంపారు.

అయితే అవి విషాహారం వల్ల మరణించలేదని ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికల ద్వారా వెల్లడైంది. దీంతో ఆ పక్షులు ఎలా చనిపోయాయి అన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఏటా శీతాకాలలో 114 జాతులకు చెందిన సుమారు 1.5 లక్షల విదేశీ వలస పక్షులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని పాంగ్‌ డ్యామ్‌ ప్రాంతానికి వస్తుంటాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.