ముంబై: అన్న అంటే తోబుట్టువులకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు..! వారికి ఏ ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాడు..! చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టకున్న ఆ 12 ఏళ్ల అభాగ్యురాలు కూడా అలాగే అనుకున్నది..! అన్నా, వదినలలోనే అమ్మానాన్నలను చూసుకుని బతుకున్నది..! కానీ తోడబుట్టిన అన్నే తన పాలిట కాలయముడు అవుతాడని కలలో కూడా అనుకోలేదు..! అన్యంపుణ్యం తెలియని పసి వయసులో సొంత అన్న చేతిలోనే తన ప్రాణాలు పోతాయని అస్సలు ఊహించలేదు..! కానీ, ఆఖరికి అదే జరిగింది..!
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానే నగరంలోగల ఉల్హాస్నగర్ ఏరియాలో ఓ 12 ఏళ్ల బాలిక తన అన్న, వదినలతో కలిసి జీవిస్తోంది. చిన్న వయసులోనే కన్నవాళ్లను కోల్పోవడంతో అన్నావదినలే ఆమె ఆలనాపాలనా చూస్తున్నారు. కానీ, ఈ భూమ్మీదకు వచ్చే అందరు ఆడబిడ్డల్లాగే తను కూడా పెద్దమనిషి కావడం ఆ బాలిక పాలిట శాపమయ్యింది. చెల్లెలి దుస్తులపై రక్తపు మరకలు చూసిన అన్న ఆమెను అనుమానించాడు. ఎవరితోనే శారీరకంగా కలవడంతోనే అలా జరిగిందని కోపంతో ఊగిపోయాడు.
ఇంట్లో ఉన్న పట్టుకారు కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు. ముఖం, కాళ్లు, చేతులు, వీపు ఇలా ఎక్కడ పడితే అక్కడ కాల్చి చిత్రవధ చేశాడు. దాంతో బాలిక పరిస్థితి విషమించింది. దాంతో ఇరుగుపొరుగుతో కలిసి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆడబిడ్డ పెద్దమనిషి అయితే ఎవరైనా పండుగలా వేడుక జరుపుకుంటారు. కానీ, తోడబుట్టిన వాడి మూర్ఖత్వంతో పెద్దమనిషి అయినందుకు ఓ అమాయకురాలు అసువులు బాసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.