న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఉత్తర భారతంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. జమ్ము కశ్మీరులో జరిగిన వివిధ ప్రమాదాలలో 10 మంది మరణించారు. జమ్ము కశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రామార్గంలో మంగళవారం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు యాత్రికులు మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
దోడా జిల్లాలో మంగళవారం మేఘ విస్ఫోటం కారణంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు నలుగురు వ్యక్తులను బలిగొనగా 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కథువా, సంబా, దోడా, జమ్ము, రాంబాన్, కిష్టార్ జిల్లాలతోసహా జమ్ము ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా జమ్ము డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో భారీ వర్షాలకు బియాస్ నది ఉప్పొంగడంతో వరద ప్రవాహానికి అనేక నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోగా భవనాలు కూలిపోయాయి. హైవేలు కోతకు గురై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మనాలీ-లేహ్ హైవేపై వరద ప్రవాహానికి పూర్తి లోడుతో ఉన్న ఓ హెవీ డ్యూటీ ట్రక్కు కొట్టుకుపోయింది. లేహ్-మనాలీ హైవేపై ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. కులూ, మనాలీ మధ్య హైవే కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. బియాస్ ఉప్పొంగుతుండటంతో పంజాబ్లోని హోషియార్పూర్లో 30 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో 27 నుంచి 30 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.