జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం బర్మేర్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Barmer Road accident ) మృతుల సంఖ్య 12కు పెరిగింది. మృతుల్లో బస్సు డ్రైవర్, చిన్నారులు ఉన్నారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 14 మందికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంకో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జోధ్పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, దురదృష్టవశాత్తు కాలిపోయిన మృతదేహాలు కొన్ని గుర్తు దొరకడం లేదని, దాంతో వారి శాంపిల్లను సేకరించి డీఎన్ఏ టెస్టుకు పంపించామని బర్మేర్ ఎస్పీ దీపక్ భార్గవ్ చెప్పారు.
బర్మేర్-జాతీయ రహదారిపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు-లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. దాంతో బస్సులోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మందికి చికిత్స పొందుతున్నారు.