న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. (medical students suicide) వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలేశారు. వీరిలో 160 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 956 మంది పీజీ విద్యార్థులు. యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (యూడీఎఫ్) నుంచి సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ సమాచారాన్ని సేకరించింది. యువ వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు, వైద్య విద్యను మధ్యలోనే వదిలేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, 2018 నుంచి 2022 వరకు 64 మంది ఎంబీబీఎస్, 58 మంది పీజీ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు గత ఆర్టీఐ డాటా ద్వారా వెల్లడైంది. అలాగే 2020-2022 మధ్య 531 వైద్య కాలేజీల్లో సుమారు 68 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్ఎంసీ గతంలో నివేదించింది.
మరోవైపు యువ వైద్యులపై విద్య, పరీక్షల ఒత్తిడి, తగినంత విశ్రాంతి లేకపోవడం, ప్రతికూల పని వాతావరణం, పని భారం, ఎక్కువ అంచనాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటివి ఆత్మహత్యలు, డ్రాపవుట్‌కు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పని గంటలు తగ్గించడం, వైద్య విద్యార్థులను పర్యవేక్షించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని సీనియర్ వైద్యులు సూచించారు.
కాగా, మెడికల్ కాలేజీల నిర్వహణ, నిర్లక్ష్యంపై ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు సుమారు 1680 ఫిర్యాదులు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో మెడికల్ కాలేజీల్లో వేధింపులు, ర్యాగింగ్‌ను నిరోధించాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తున్నదని సీనియర్ డాక్టర్లు వెల్లడించారు.