Terror Attack | కశ్మీర్: వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీవోకే) 42 ఉగ్ర శిబిరాలు క్రియాశీలంగా ఉన్నాయని, వీటిలో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు మకాం వేసి ఉన్నారని నిఘా సంస్థలు అంచనా వేశాయి. ఈ ఉగ్రవాదులలో 115 మంది పాకిస్థానీ జాతీయులని కూడా అధికారులు తెలిపారు. బందిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. కశ్మీరులో సుమారు 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారని, జమ్ము, రాజౌరీ, పూంచ్ ప్రాంతాలలో 60 నుంచి 65 మంది కార్యకలాపాలు సాగిస్తున్నారని వెల్లడించారు.
జమ్ముకశ్మీరులోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడితో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ బుధవారం చెప్పారు. పాకిస్థానీ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ, అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, అది ఎక్కడ ఉన్నా తాము తిరస్కరిస్తామని తెలిపారు.
పహల్గాం ఉగ్ర దాడి దరిమిలా భారత్ తమపై ప్రతీకార దాడి చేయవచ్చని భావిస్తున్న పాకిస్థాన్ అదే జరిగితే తాము దాన్ని దీటుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని బుధవారం ప్రకటించింది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారీ మీడియాకు విడుదల చేసిన ఓ వీడియో క్లిప్‌లో తప్పుడు సాకుతో భారత్ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గతంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను రెండు రోజులపాటు తమ బందీగా ఉంచుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, పోయినసారి టీ ఇచ్చామని, ఈసారి అలాంటి మర్యాదలేమీ ఉండవని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు.