ముంబై: కరోనా వైరస్ మొదటి రెండు దశల్లో మహారాష్ట్రలో విలయతాండవం చేసింది. కరోనా కొత్త వేరియంట్‌కు కూడా రాష్ట్రం కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిలో వైరస్ విజృంభిస్తున్నది. విపత్కర పరిస్థితుల్లో కూడా డ్యూటీ ఫస్ట్ అని విధులు నిర్వహించే పోలీసులు భారీసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మహానగరంలో ఆదివారం ఒకేరోజు 114 మంది పోలీసులు, 18 మంది సీనియర్ పోలీసు అధికారులకు వైరస్ సోకిందని ముంబై పోలీస్ శాఖ వెల్లడించింది.
వీరిలోలో 13 మంది డిప్యూటీ కమిషనర్లు (DCP), నలుగురు అడిషనల్ సీపీలు, ఓ జాయింట్ సీపీ ఉన్నారని తెలిపింది. అదేవిధంగా గత 48 గంటల్లో ఇద్దరు సిబ్బంది మహమ్మారి వల్ల మరణించారని పేర్కొన్నది. దీంతో కరోనా వైరస్ వల్ల చనిపోయిన ముంబై పోలీసుల సంఖ్య 125కి చేరింది.
బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో (BMC) నిన్న 19,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు మృతిచెందారు. నగరంలో ప్రస్తుతం 1,17,437 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని బీఎంసీ తెలిపింది.