Delhi Railway Station | న్యూఢిల్లీ : ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన 14, 15 ప్లాట్‌ఫాంలపై జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచారు. కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసినట్లు అధికారులు భావిస్తున్నారు.