తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్ నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు కేరళలో పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 11 రైళ్లను అధికారులు రద్దు చేశారు. సిమెంటు లోడుతో కొళ్లాం వెళ్తున్న గూడ్సు రైలు గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో అలువా రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది.
దీంతో రైలులోని నాలుగు బోగీలు పట్టాలపైనుంచి పక్కకు జరిగాయి. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును వెంటనే నిలిపివేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంతో అదే ట్రాక్ గుండా వెళ్లాల్సిన ఆరు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 11 రైళ్లను అధికారులు నిలిపివేశారు. కాగా, పట్టాలు తప్పిన బోగీలను పునరుద్ధరించిన అధికారులు లైన్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు.