న్యూఢిల్లీ: ఇంట్లో ఉన్న పిస్టల్‌ను టాయ్ గన్‌గా ఒక విద్యార్థి భావించాడు. దానిని స్కూల్‌కు తీసుకువచ్చాడు. (Student Brings Pistol To School) గమనించిన స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిని పిలిపించి ఆ పిస్టల్ గురించి ఆరా తీశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. దీపక్ విహార్‌లోని గ్రీన్ వ్యాలీ స్కూల్లో పదేళ్ల బాలుడు చదువుతున్నాడు. ఇంట్లో ఉంచిన పిస్టల్‌ను ఆడుకునే గన్‌గా పొరపాటుపడ్డాడు. దానిని బ్యాగ్‌లో ఉంచుకుని స్కూల్‌కు తీసుకొచ్చాడు.
కాగా, ఆ విద్యార్థి వద్ద పిస్టల్ ఉండటాన్ని గమనించిన స్కూల్ సిబ్బంది షాక్ అయ్యారు. స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలాగే బాలుడి తల్లిని కూడా స్కూల్‌కు పిలిపించారు. ఆ స్కూల్‌కు చేరుకున్న పోలీసులు ఆ పిస్టల్ గురించి బాలుడి తల్లిని ఆరా తీశారు.
మరోవైపు కొన్ని నెలల క్రితం చనిపోయిన తన భర్తకు చెందిన పిస్టల్ అని బాలుడి తల్లి పోలీసులకు తెలిపింది. ఆ తుపాకీకి లైసెన్స్ ఉందని చెప్పింది. పిస్టల్‌ను పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ చేసేందుకు బయట ఉంచినట్లు వివరించింది. అయితే టాయ్ గన్‌గా భావించిన తన కుమారుడు దానిని స్కూల్‌కు తెచ్చాడని వెల్లడించింది.
కాగా, ఆ పిస్టల్ లైసెన్స్‌ను పోలీసులు వెరిఫై చేశారు. ఈ విషయంలో ఎలాంటి నేరం జరుగలేదని నిర్ధారించారు. అనంతరం బాలుడి తల్లి ఆ గన్ను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించింది.