న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : హాయిగా నిద్రపోతే జీతం ఇచ్చే జాబ్ ఉంటే ఎంత బాగుండు! అని అనుకుని ఉంటాం కదా. అలాంటి జాబ్ తాము ఆఫర్ చేస్తమంటున్నది వేక్‌ఫిట్ సంస్థ. ప్రముఖ మ్యాట్రెస్ సంస్థ అయిన వేక్‌ఫిట్.. రోజుకు 8 గంటలు నిద్రపోతే రూ.10 లక్షల వరకు స్టైపెండ్ ఇస్తామని చెప్తున్నది. పైగా, నిద్రించటానికి పరుపు కూడా తామే ఉచితంగా ఇస్తామని అంటున్నది. ఈ మేరకు ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. రెండు నెలల పాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌ను వర్క్ ఫ్రమ్ బెడ్ నుంచే చేయొచ్చు. ఈ ఉద్యోగానికి అర్హతలు ఏంటంటే.. రోజుకు 8-9 గంటల పాటు నిద్రపోవాలి. మధ్యాహ్నం సమయంలో 20 నిమిషాల పాటు చిన్న కునుకు తీయాలి. వీకెండ్స్‌లో వీలైతే ఎక్కువసేపు నిద్రపోవాలి. స్లీప్ మెంటార్స్ నిర్వహించే వర్క్‌షాపులకు హాజరవ్వాలి. నిద్రలో 22 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు. సెలెక్ట్ అయ్యే ఇంటర్న్‌కు రూ.1 లక్ష, స్లీప్ చాంపియన్‌గా ప్రమోట్ అయ్యేవారికి ఏడాదికి రూ.10 లక్షలు ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు వేక్‌ఫిట్ లింక్డ్ఇన్ పేజీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.