Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని ఆరు జిల్లాల్లో విషాదం నెలకొంది. పిడుగులు పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం భారీ వర్షాలతో పాటు పిడుగులు పడటంతో ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలన్‌గిర్‌లో ఇద్దరు, అంగుల్, బౌద్, జగత్సింగ్పూర్, దేన్‌కనాల్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. ఖుర్దా జిల్లాలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒడిశా తీర ప్రాంతంతో పాటు భువనేశ్వర్, కటక్ పట్టణాల్లో భారీ వర్షం కురిసింది. పిడుగులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. రాబోయే నాలుగు రోజుల పాటు ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
భువనేశ్వర్‌లో అత్యధికంగా 126 మి.మీ. వర్షపాతం నమోదైంది. కటక్‌లో 95.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.